ఎవరు అధికారంలో ఉంటే వారి వెనుక తిరిగే వ్యక్తి పోసాని: బండ్ల గణేశ్

01-10-2021 Fri 21:20
  • పవన్ పై పోసాని వ్యాఖ్యలను ఖండించిన బండ్ల గణేశ్
  • పోసాని ఎక్స్ పైర్ అయిన ట్యాబ్లెట్ లాంటివాడని విమర్శలు
  • పోసాని భార్యకు పాదాభివందనం చేస్తానని వెల్లడి
  • ఎలా భరిస్తున్నారంటూ వ్యాఖ్యలు
Bandla Ganesh criticizes Posani

మా జనరల్ సెక్రటరీగా నామినేషన్ ను వెనక్కి తీసుకున్న అనంతరం బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పోసాని కృష్ణమురళిపై మండిపడ్డారు. తాను దేవుడిగా భావించే పవన్ కల్యాణ్ ను పోసాని విమర్శించడం పట్ల బండ్ల గణేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎవరు అధికారంలో ఉంటే వారి వెనుక తిరిగే వ్యక్తి పోసాని అని వ్యాఖ్యానించారు. అయినా పోసాని ఓ కాలం చెల్లిన మాత్ర వంటివాడని పేర్కొన్నారు. ఆయనను ఎలా భరిస్తుందో కానీ, పోసాని భార్యకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. పోసాని భార్య తనకు తల్లివంటిదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.

"మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ గురించి ఏదో మాట్లాడాడు... అంతవరకు ఓకే. రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ తల్లి అంజనాదేవి గురించి మాట్లాడడాన్ని ఖండిస్తున్నా. పవన్ ను తిట్టుకోండి... కానీ పవన్ తల్లి అంజనాదేవి, ఇతర స్త్రీల ప్రస్తావన ఎందుకు? ఆ తల్లి కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి" అని వివరించారు.

ఇక పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో మంచు విష్ణు స్పందించిన విధానం తనను బాధించిందని బండ్ల గణేశ్ అన్నారు. ఇండస్ట్రీ వైపు ఉంటారా? పవన్ వైపు ఉంటారా? అని మంచు విష్ణు అన్నారని వివరించారు. పవన్ తెలుగు చిత్ర పరిశ్రమకు రథసారథి వంటివాడని, ఎదుటివారు కష్టాల్లో ఉంటే సాయపడే వ్యక్తి పవన్ అని కొనియాడారు.