Telangana: తెలుగు అకాడమీ కేసుపై సర్కారు సీరియస్.. డైరెక్టర్‌ సోమిరెడ్డి సస్పెన్షన్

  • నిధుల గోల్‌మాల్ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్టు 
  • మొత్తం రూ.60 కోట్ల కుంభకోణం జరిగినట్లు వెల్లడి 
  • సీరియస్ గా తీసుకున్న సర్కారు 
Telugu academy director sacked by government

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసును తెలంగాణ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంస్థ మేనేజర్ పద్మావతి, ఆ సంస్థ చైర్మన్ సత్యనారాయణ రాజు, అదే సంస్థకు చెందిన ఉద్యోగి మొయినుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తమ్మీద ఈ కుంభకోణంలో రూ.60 కోట్ల రూపాయల వరకూ అకాడమీ నిధులు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు.

వీటిలో అధికభాగం హైదరాబాద్‌లోని కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖ నుంచే మాయమయ్యాయి. గతేడాది జులై నుంచి విడతలవారీగా ఈ బ్యాంకులోని సొమ్ములో రూ.43 కోట్లు కాజేశారు. ఇదే బ్యాంకు సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి మరో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. ఈ డబ్బును జులై, ఆగస్టు నెలల్లో దారి మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీనికితోడు కెనరా బ్యాంకు నుంచి మరో రూ. 9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము కూడా గోల్‌మాల్ చేశారు.

దీంతో మొత్తమ్మీద ఈ కుంభకోణంలో రూ. 60 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారినట్లు తేలింది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న సర్కారు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని పదవి నుంచి తప్పించింది. ఈ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు అప్పగించింది.

More Telugu News