Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల మాయం ఘటనలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

CCS Police arrests two more persons in Telugu Academy case
  • తెలుగు అకాడమీలో రూ.60 కోట్ల వరకు మాయం
  • సీసీఎస్ పోలీసుల దర్యాప్తు
  • బ్యాంకు ఉద్యోగుల పాత్ర
  • ఇప్పటికే ఇద్దరి అరెస్ట్
  • తాజా అరెస్టులతో పోలీసుల అదుపులో మొత్తం నలుగురు
తెలుగు అకాడమీకి సంబంధించిన దాదాపు రూ.60 కోట్ల మేర ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయం అయిన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇవాళ ఉదయం యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ సహకార బ్యాంకు మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏపీ మర్కంటైల్ సహకార బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ, ఏపీ మర్కంటైల్ సహకార బ్యాంకు ఉద్యోగి మొయినుద్దీన్ లను అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. ఈ నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

తెలుగు అకాడమీకి చెందిన నిధులను వారు దారిమళ్లించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్ సహకార బ్యాంకులో ఖాతాలు సృష్టించి, యూనియన్ బ్యాంకు నుంచి ఆయా ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసినట్టు వెల్లడైంది. నకిలీ ఖాతాలు తెరిచేందుకు సహకార బ్యాంకు ఉద్యోగులు సహకరించినట్టు తేలింది.
Telugu Academy
Fraud
CCS Police
Arrest

More Telugu News