బీజేపీని ముక్కలు ముక్కలు చేసేస్తా: కన్నయ్య కుమార్ ఆవేశం

01-10-2021 Fri 19:52
  • ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కన్నయ్య కుమార్
  • విద్యార్థి నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం 
  • రాహుల్ ధైర్యవంతుడైన నాయకుడన్న కన్నయ్య 
Congress leader Kanhaiya Kumar fires on BJP

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ బీజేపీపై ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు తమను "ముక్కలు చెక్కల పార్టీ" అని పిలుస్తున్నారని, అదే బీజేపీని తాను ముక్కలు ముక్కలు చేసేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, అది తాను కళ్లారా చూస్తానని కన్నయ్య కుమార్ ధీమాగా చెప్పారు. గాంధీని కాకుండా గాడ్సేని జాతిపిత అని చెప్పే పార్టీ బీజేపీ అని విమర్శించారు. వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎదుట మాత్రం గాంధీని జాతిపిత అని కొనియాడుతుంటారని పేర్కొన్నారు.

కన్నయ్య కుమార్ ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ గాంధీ నిజాయతీపరుడైన, ధైర్యవంతుడైన నాయకుడు అని అభివర్ణించారు. సత్యమేవ జయతే నినాదాన్ని నమ్మిన వ్యక్తి అని వివరించారు.