రేపు కర్నూల్ లో 'కొండ పొలం' ఆడియో రిలీజ్ ఈవెంట్!

01-10-2021 Fri 18:36
  • క్రిష్ నుంచి మరో విభిన్న కథా చిత్రం
  • 'ఉప్పెన' తరువాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా
  • కీరవాణి పాటలకు మంచి రెస్పాన్స్
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల    
Kondapolam
టాలీవుడ్ దర్శకులలో క్రిష్ స్థానం ప్రత్యేకం. వినోదం .. సందేశం కలగలిసిన కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాలు ఆనందింపజేస్తాయి .. ఆలోచింపజేస్తాయి. 'గమ్యం' .. 'వేదం' .. 'కంచె' సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఈ సారి కూడా ఆయన అదే తరహాలో ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరే .. 'కొండ పొలం'. వైష్ణవ్ తేజ్ - రకుల్  జంటగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. కీరవాణి స్వరకల్పన నుంచి వచ్చిన పాటలు, మనసులను హత్తుకుపోయాయి. రేపు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను కర్నూల్ లో నిర్వహించనున్నారు.

కర్నూల్ లో సంతోష్ నగర్ కాలనీలోని కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ మొదలు కానుంది. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. 'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, 'కొండ పొలం'తో మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.