పింక్ బాల్ టెస్టులో స్మృతి మంధాన సరికొత్త రికార్డు

01-10-2021 Fri 16:34
  • ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ 
  • పింక్‌బాల్ టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత మహిళ 
  • 171 బంతుల్లో మూడంకెల స్కోరు చేరిన స్మృతి 
Smiting Mandhanna creates history in first pink ball test

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్‌బాల్ టెస్టులో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధాన చూడచక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్‌బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

అంతేకాదు తాను ఆడిన తొలి డే-నైట్ టెస్టులో సెంచరీ చేసిన రెండో భారతీయురాలిగా కూడా నిలిచింది. గతంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మంధాన ఇన్నింగ్సులో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అసలు ఆమె తొలి రోజే సెంచరీ చేయాల్సింది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో తొలిరోజు కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.

దీంతో ఆమె సెంచరీ రెండో రోజుకు వాయిదా పడింది. అయితే రెండో రోజు ఆటలో ఆమె అవుటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. రెండో రోజు రెండో ఓవర్లో పెర్రీ బంతికి క్యాచ్ అవుటైంది. కానీ ఆ బంతి నోబాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకుంది.