టెస్ట్ క్రికెట్ లో రికార్డు.. ‘ఆఫ్ సైడ్ దేవత’ అంటూ స్మృతి మందానపై ప్రశంసలు!

01-10-2021 Fri 13:12
  • ఆస్ట్రేలియాతో డేనైట్ టెస్టులో శతకం
  • కెరీర్ లో మొదటి సెంచరీ.. ఆస్ట్రేలియాలోనూ మొదటిదే
  • 216 బంతుల్లో 127 రన్స్ చేసిన ఓపెనర్
  • అభినందనలతో ముంచెత్తుతున్న మాజీలు
Cricket Fraternity Praise Smriti Mandana a Offside Goddess

క్వీన్స్ లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ (డేనైట్) టెస్టులో భారత మహిళల టీమ్ ఓపెనర్ స్మృతి మందాన చెలరేగిపోతోంది. ఆస్ట్రేలియాలో తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అంతేకాదు.. తన కెరీర్ లోనూ ఆమెకు ఇది తొలి శతకం కావడం విశేషం. 216 బంతుల్లో 127 పరుగులు చేసిన ఆమె.. ఆట రెండో రోజు ఆష్లే గార్డ్ నర్ బౌలింగ్ లో వెనుదిరిగింది.

అయితే, ఆమెపై భారత మాజీ క్రికెటర్లు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ‘ఆఫ్ సైడ్ దేవత’ అంటూ మాజీ టెస్ట్ క్రికెటర్ వసీం జాఫర్ కొనియాడాడు. తొలి శతకాన్ని నమోదు చేసినందుకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. స్మృతి బ్యాట్ నుంచి ఇలాంటి శతకాలు మరెన్నో రావాలని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆకాంక్షించాడు. అంజుమ్ చోప్రా, దొడ్డ గణేశ్ వంటి మాజీలూ ఆమెకు అభినందనలు తెలియజేశారు.