ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మంత్రి శంక‌ర‌నారాయ‌ణ తీవ్ర‌ విమ‌ర్శ‌లు

01-10-2021 Fri 12:11
  • ప‌వన్‌ కు సినిమాల కాల్‌షీట్లు  లేకపోతేనే రాజకీయాలు గుర్తుకొస్తాయి
  • శ్ర‌మ‌దానం పేరుతో ర‌హ‌దారుల‌పైకి వ‌చ్చి హ‌డావుడి
  • ఉనికిని నిల‌బెట్టుకోవాల‌న్న‌దే ఆలోచ‌న
  • గ‌త‌ టీడీపీ ప్రభుత్వం  వల్లే రోడ్లు బాగోలేవు
shankara narayana slams pawan
సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్ముకోవ‌డం ఏంటంటూ ఏపీ స‌ర్కారుపై జ‌నసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లపై ఏపీ మంత్రులు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మంత్రి శంకరనారాయణ కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై విమర్శలు గుప్పించారు. ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్ కు సినిమాల‌కు కాల్‌షీట్లు  లేకపోతేనే రాజకీయాలు గుర్తుకు వస్తాయని విమ‌ర్శించారు.

త‌మ పాల‌న‌లో రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉన్నారు కాబ‌ట్టే ఇత‌ర పార్టీల‌ను వారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని చెప్పారు. శ్ర‌మ‌దానం పేరుతో ర‌హ‌దారుల‌పైకి వ‌చ్చి హ‌డావుడి చేసి, ఉనికిని నిల‌బెట్టుకోవాల‌న్న‌దే జ‌న‌సేన ఆలోచ‌న అని చెప్పారు. టీడీపీ, జనసేన ఉనికిని కోల్పోతున్నాయ‌ని చెప్పారు. గ‌త‌ టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ నిధులను ప్రక్కదారి పట్టించింద‌ని విమర్శించారు. అందుకు ఇప్పుడు ఏపీలోని రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. వ‌ర్షాలు త‌గ్గాక తామే ఏపీలో ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తు ప‌నులను చేప‌డ‌తామ‌ని తెలిపారు.