Vadivelu: సినీ నటుడు వడివేలుకు కోర్టు నోటీసులు

  • రూ. 1.93 కోట్లను ఐటీ లెక్కల్లో చూపించలేదని గుర్తించిన అధికారులు
  • తనకు తెలియకుండానే సింగముత్తు భూమిని అమ్మాడంటూ వడివేలు కేసు
  • కోర్టు విచారణకు హాజరుకాని వడివేలు
Court issues notice to actor Vadivelu

ప్రముఖ తమిళ సినీ నటుడు వడివేలుకు ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని నోటీసులో ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, వడివేలు నివాసంలో గతంలో ఐటీ దాడులు జరిగాయి.

తాంబరం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ. 1.93 కోట్లకు అమ్మి, దాన్ని ఐటీ లెక్కల్లో చూపించనట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో వడివేలు షాక్ కు గురయ్యారు. 2007లో కొనుగోలు చేసిన స్థలాన్ని తన ప్రమేయం లేకుండా తన సహచరుడు సింగముత్తుతో పాటు మరికొందరు విక్రయించినట్టు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది. అయితే ఈ కేసు విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యాయి. కానీ, ఆయన కోర్టుకు రాలేదు. మరోవైపు సింగముత్తు తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై... కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం... కోర్టుకు వడివేలు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News