Doctor Nori: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ప్రఖ్యాత వైద్యుడు నోరి దత్తాత్రేయుడు నియామకం

  • రేడియేషన్ ఆంకాలజీలో డాక్టర్ నోరికి 43 ఏళ్ల అనుభవం
  • 2015లో పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం
  • రెండేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగనున్న డాక్టర్ నోరి
AP Govt appoints doctor Nori as Govt advisor

ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీ సర్కార్ నియమించింది. ఆ పదవిలో రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. డాక్టర్ నోరి నియామకానికి సంబంధించి పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడిగా డాక్టర్ నోరి పేరుగాంచారు. గత మంగళవారం ముఖ్యమంత్రి జగన్ తో డాక్టర్ నోరి భేటీ అయ్యారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని నోరిని జగన్ కోరారు.

రేడియేషన్ ఆంకాలజీలో డాక్టర్ నోరికి 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, తల, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిస్ ప్రోగ్రామ్ ల కోసం అడ్వాన్స్ డ్ టెక్నిక్ లు, కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వైద్యరంగంలో చేసిన కృషికి గాను 2015లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

More Telugu News