ప్రజాప్రతినిధుల కోర్టులో విజయమ్మ, షర్మిలకు ఊరట

01-10-2021 Fri 08:19
  • ప్రజా ప్రతినిధుల కోర్టుకు క్యూ కట్టిన నేతలు
  • షర్మిల, విజయమ్మపై 2012లో నమోదైన కేసు కొట్టివేత
  • ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు సమన్లు
court dismissed case against ys sharmila and vijayamma

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఉమ్మడి ఏపీలో 2012లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల ప్రచారం నిర్వహించారని, కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో వీరిద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసును నిన్న విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ప్రజాప్రతినిధుల కోర్టుకు నిన్న పలువురు నేతలు క్యూకట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, కొండా సురేఖ, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరి, వేణుగోపాలాచారి, చిన్నారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు, ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులో ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న సమన్లు జారీ చేసింది. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో సుమన్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.