Gandra Satyanarayana: కాంగ్రెస్‌లో చేరిన గండ్ర సత్యనారాయణ.. నేడు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్

  • భూపాలపల్లి కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గండ్ర
  • తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారన్న రేవంత్
  • ‘హుజూరాబాద్’ కోసం పలువురి పేర్లను అధిష్ఠానానికి పంపిన కాంగ్రెస్ 
Gandra Satyanarayana joins in Congress

టీఆర్ఎస్ మాజీ నేత గండ్ర సత్యనారాయణరావు నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత రాత్రి జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గండ్ర గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన గండ్ర 2018లో పార్టీ టికెట్ ఆశించారు. అది దక్కకపోవడంతో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గండ్ర చేరిక సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసం కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పాలనకు ఇక కాలం చెల్లినట్టేనన్నారు. నక్సలైట్ల ఎజెండా ఏమైపోయిందని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొందరు పోలీసులు తమ కార్యకర్తలను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, వారి పేర్లను డైరీలో రాసుకుంటున్నానని హెచ్చరించారు. వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనన్న సంగతిని ప్రధాని మోదీ కూడా అంగీకరించారని రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంథని, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మధుయాస్కీగౌడ్, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ నేడు ప్రకటించనుంది. అభ్యర్థి ఎంపికపై నిన్న సీఎల్పీ కార్యాలయంలో మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సుదీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, రవికుమార్, కృష్ణారెడ్డి పేర్లను ఇప్పటికే అధిష్ఠానానికి పంపారు.

More Telugu News