SRH: ప్లే ఆఫ్స్‌కు చెన్నై.. చివరి వరకు పోరాడి ఓడిన హైదరాబాద్

  • దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ధోనీ సేన
  • ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా జోష్ హేజిల్‌వుడ్
Hazlewood Bravo setup CSKs march into the Playoffs

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ఇక ముగిసినట్టే. గత రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్ఎస్ 9 మ్యాచుల్లో ఓడి, ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డులకెక్కింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ను 134/7కే కట్టడి చేసిన చెన్నై.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు ఆడింది. ఫలితంగా చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన హైదరాబాద్‌కు అదృష్టం కలిసి రాలేదు. తొలుత నెమ్మదిగా ఆడిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ నాలుగో ఓవర్ నుంచి జోరు పెంచారు. తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించారు.

రుతురాజ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, డుప్లెసిస్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వీరిద్దరు అవుటైన తర్వాత చెన్నై కొంత తడబడింది. మరోవైపు, హైదరాబాద్ బౌలర్లు పట్టుబిగించడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. జేసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టి జట్టులో ఆశలు రేపాడు. అయితే, చివర్లో అంబటి రాయుడు (17), కెప్టెన్ ధోనీ (14) పని పూర్తి చేసి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. హేజిల్‌వుడ్ మూడు వికెట్లు తీసి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బ్రావో రెండు వికెట్లు తీసుకోవడంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ 18, అబ్దుల్ సమద్ 18, రషీద్ ఖాన్ 17 పరుగులు చేశారు. మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన జోష్ హేజిల్‌వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది.

More Telugu News