ఇప్పుడు విడుదలయ్యే సినిమాలన్నీ మీపైనే ఆధారపడి ఉన్నాయి!: ఏపీ సీఎం జగన్ కు అల్లు అరవింద్ విజ్ఞప్తి

30-09-2021 Thu 20:51
  • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన అల్లు అరవింద్
  • చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై స్పందన
  • సహకారం అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
Tollywood producer Allu Aravind appeals CM Jagan
ఇటీవలి పరిణామాలు, సినీ రంగ సమస్యల నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏపీ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో, అదే విధంగా తెలుగు సినీ పరిశ్రమను కూడా గట్టెక్కించాలని కోరారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? అని అల్లు అరవింద్ సీఎం జగన్ ను ప్రస్తుతించారు.

అఖిల్ అక్కినేని నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

చిత్ర పరిశ్రమ సమస్యలను ఏపీ సర్కారు అర్ధం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు విడుదలయ్యే సినిమాలన్నీ మీపైనే ఆధారపడి ఉన్నాయి అని పేర్కొన్నారు. 'చిత్ర పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు మీవంతు సంపూర్ణ సహకారం అందించండి' అంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.