Janasena: పోసాని ఇంటిపై దాడికి, పార్టీకి సంబంధం లేదు: జనసేన తెలంగాణ ఇంచార్జి

  • పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్
  • పవన్‌పై పోసాని వ్యాఖ్యల వెనుక ఏపీ ప్రభుత్వం
  • పనికిరాని వ్యక్తికి 300 మంది పోలీసుల భద్రత అవసరమా?
  • ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్‌గౌడ్
no relation between party and attack on posani house sayd Janasena

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది పవన్ అభిమానులేనని, వారిపై చర్యలు తీసుకోవాలని పోసాని ఆరోపించారు. దీనిపై జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్‌గౌడ్ స్పందించారు. పోసాని ఇంటిపై దాడికి, జనసేన పార్టీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని శంకర్‌గౌడ్ ఆరోపించారు. పోసానిపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తే, వాటిని పోలీసులు స్వీకరించకపోవడంపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడికే రక్షణ కరవవడం శోచనీయమన్నారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌, అసదుద్దీన్‌లకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ నుంచి పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పోసానిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి పనికిరాని వ్యక్తికి 300 మంది పోలీసుల భద్రత అవసరమా? అని శంకర్ గౌడ్ మండిపడ్డారు.

More Telugu News