'అరణ్మనై 3' నుంచి ఉత్కంఠను రేకెత్తిస్తున్న ట్రైలర్!

30-09-2021 Thu 18:20
  • సుందర్ సి నుంచి మరో హారర్ కామెడీ
  • గతంలో వచ్చిన రెండు భాగాలు హిట్
  • అక్టోబర్లో రానున్న మూడో భాగం
  • ప్రధాన పాత్రల్లో ఆర్య .. రాశి ఖన్నా .. ఆండ్రియా
Aranmanai 3 movie trailer released
తమిళనాట హారర్ కామెడీ సినిమాలు చేయడంలో సుందర్.సి ఎంతో ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటాడు. హారర్ కీ .. కామెడీకి మధ్య ఎమోషన్ ఉండేలా చూసుకుంటాడు. అదే సమయంలో కాస్త రొమాన్స్ కి చోటు ఇస్తాడు. ఇంతవరకూ వచ్చిన 'అరణ్మనై' .. 'అరణ్మనై 2' సినిమాలలో హన్సిక .. త్రిష .. ఆండ్రియా ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వచ్చారు.

ఈ రెండు సినిమాలు తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 'అరణ్మనై 3' సినిమాను రూపొందించాడు. ఆర్య .. రాశి ఖన్నా .. ఆండ్రియా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక సుందర్ సి .. సాక్షి అగర్వాల్ .. సంపత్ రాజ్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక ప్యాలెస్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ అనే విషయం అర్థమవుతోంది. ఆ ప్యాలెస్ లో ప్రేతాత్మలు ఎందుకు తిరుగుతున్నాయనేది ఉత్కంఠను రేకెత్తించే అంశం. ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారనే విషయం, భారీతనాన్ని బట్టి తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని స్పష్టం చేశారు.