సీఎంని కలిసిన సిద్ధూ.. పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం సమసిపోతుందా?

30-09-2021 Thu 17:25
  • ఇటీవలే పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా
  • పీసీసీ చీఫ్ గా కొనసాగుతానని వ్యాఖ్య
  • సమస్య ముగిసిపోతుందన్న సిద్ధూ సలహాదారు 
Siddu meets Punjab CM
పంజాబ్ కాంగ్రెస్ లో అలజడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేయాల్సి రావడం, కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ పగ్గాలు చేపట్టడం, పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం వంటి పరిణామాలు... ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

మరోవైపు పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేయడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. పార్టీ హైకమాండ్ సైతం ఈ పరిణామంపై షాక్ కు గురయింది. ఈ నేపథ్యంలో సీఎం చరణ్ జిత్ ను ఈ రోజు సిద్ధూ కలిశారు.

పటియాలా నుంచి చండీగఢ్ కు వెళ్లిన సిద్ధూ... చరణ్ జిత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగుతానని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తానని అన్నారు.

మరోవైపు సిద్ధూ సలహాదారు మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ, సమస్య త్వరలోనే సమసిపోతుందని చెప్పారు. పార్టీ హైకమాండ్ కంటే ఎవరూ గొప్ప కాదనేది సిద్ధూ స్వభావం అనేది పార్టీ పెద్దలకు తెలుసని అన్నారు. అమరీందర్ సింగ్ లాంటి వ్యక్తి సిద్ధూ కాదని... అమరీందర్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఎప్పుడూ కేర్ చేయలేదని చెప్పారు. కొన్ని సందర్భాల్లో సిద్ధూ భావోద్వేగాలకు గురవుతుంటారని అన్నారు.