Congress: కపిల్ సిబల్ ఇంటి ముందు గూండాగిరి.. దిగజారుడు చర్యలతో కాంగ్రెస్ పరువు పోతుంది.. పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపాటు

  • పంజాబ్ లో పరిణామాలపై సిబల్ విమర్శలు
  • అధ్యక్షులే లేరంటూ కామెంట్లు
  • సిబల్ ఇంటిపై టమాటాలు విసిరిన పార్టీ కార్యకర్తలు
  • భావస్వేచ్ఛను కాపాడడంలో కాంగ్రెస్ ది ఘన చరిత్ర అన్న ఆనంద్ శర్మ
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి
Hooliganism At Sibal House Shocked Says Anand Sharma

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఇంటి ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఆ పార్టీ మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలపై కపిల్ సిబల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి ప్రెసిడెంట్ లేరని, అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలిసే పరిస్థితీ లేదని ఆయన విమర్శించారు.

దీనిపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఉన్న సిబల్ ఇంటిపై దాడి చేశారు. సిబల్ ఇంటి మీదకు టమాటాలు విసిరారు. అంతేగాకుండా సిబల్ త్వరగా కోలుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై తాజాగా ఆనంద్ శర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

కపిల్ సిబల్ ఇంటి ముందు దాడి, గూండాగిరి షాక్ కు గురి చేసిందని ఆయన విమర్శించారు. ఇలాంటి దిగజారుడు చర్యల వల్ల పార్టీ పరువు పోతుందని, వీటిని ఖండించాల్సిన అవసరముందని అన్నారు. భావస్వేచ్ఛ హక్కును కాపాడడంలో కాంగ్రెస్ కు ఘనమైన చరిత్ర ఉందని, విభిన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో అంతర్గత భాగమని చెప్పుకొచ్చారు. అసహనం, హింస కాంగ్రెస్ విలువలు, సంస్కృతికి చీడ అని అన్నారు. దాడికి కారకులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

More Telugu News