Galla Jayadev: భూ వివాదంలో గల్లా కుటుంబం.. జయదేవ్ సహా 12 మందిపై కేసుల నమోదు!

  • తన పొలాన్ని ఆక్రమించుకున్నారంటూ కోర్టును ఆశ్రయించిన రైతు
  • కేసులు నమోదు చేయాలన్న చిత్తూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు
  • జయదేవ్ తల్లి, తండ్రిపై కూడా కేసు నమోదు
Case filed against TDP MP Galla Jayadev

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భూవివాదంలో ఇరుక్కున్నారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేశారు.

కేసు వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని... భారీగా ప్రహరీ గోడ నిర్మించారని రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకపోయిందని చెప్పారు. చివరకు 2 నెలల క్రితం కోర్టును ఆశ్రయించానని తెలిపారు.

మరోవైపు కోర్టు ఆదేశాలతో గల్లా జయదేవ్ తదితరులపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై చిత్తూరు డీఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ... గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం.మోహన్ బాబు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, లాయర్ చంద్రశేఖర్ పై కేసులు నమోదు చేశామని తెలిపారు.

More Telugu News