RCB: బెంగళూరు ఘన విజయం.. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టం

  • బెంగళూరు ఆల్‌రౌండర్ ప్రతిభ
  • బెంగళూరు బౌలర్లకు తలవంచిన రాజస్థాన్
  • చాహల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
Maxwell and bowlers spur big win for RCB

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకుంది. రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్లేఆఫ్స్‌కు చేరువ కాగా, ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత కష్టమయ్యాయి.

రాజస్థాన్‌ను తొలుత 149 పరుగులకు కట్టడి చేసిన కోహ్లీ సేన గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ్రీకర్ భరత్ మెరుపులతో మరో 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. మ్యాక్స్‌వెల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 50 పరుగులు చేయగా, 35 బంతులు ఎదుర్కొన్న భరత్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. కోహ్లీ 25, పడిక్కల్ 22 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించి భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించింది. అయితే, ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు పట్టుబిగించడంతో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లూయిస్-జైస్వాల్ ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగించడంలో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 8.2 ఓవర్లకు 77/1తో బలంగా కనిపించిన రాజస్థాన్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 177/5తో కష్టాల్లో కూరుకుపోయింది. చివరికి 149/9 వద్ద ఇన్నింగ్స్ ముగించింది.

లూయిస్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేయగా, జైస్వాల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ శాంసన్ 19 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా, చాహల్, షాబాజ్ అహ్మద్ చెరో రెండు, గార్టన్, క్రిస్టియన్ చెరో వికెట్ పడగొట్టారు. 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన చాహల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్-చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News