Dil Raju: ఆన్ లైన్లో టికెట్లు అమ్మాలని ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరాం: దిల్ రాజు స్పష్టీకరణ

  • జగన్ ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు కలిశాం
  • సినీ పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం
  • ఆన్ లైన్ విధానం ఎలా ఉండబోతోందో స్పష్టతను ఇవ్వాలని పేర్ని నానిని కోరాం
We have asked AP govt to sell tickets online says Dil Raju

ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రచ్చ జరుగుతోంది. ఈ అంశంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలపై పేర్ని నానితో పాటు ఇతర మంత్రులు మండిపడ్డారు. ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు వైసీపీ, జనసేన పార్టీల మధ్య గొడవగా మారిపోయింది. వివాదం ముదురుతుండటంతో సినీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానిని ఈరోజు సినీ నిర్మాతలు కలిశారు.

భేటీ అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు కలిశామని చెప్పారు. సినీ పరిశ్రమపై కరోనా ప్రభావంతో పాటు ఇతర సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సినీ పరిశ్రమ చాలా సున్నితమయినదని... దయచేసి ఇండస్ట్రీని వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. టికెట్లను ఆన్ లైన్లో అమ్మాలని పరిశ్రమ తరపున ప్రభుత్వాన్ని తామే కోరామని చెప్పారు. ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకత వస్తుందని అన్నారు.

అయితే గత చర్చల సారాంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని... అందువల్లే ప్రస్తుత పరిణామాలు నెలకొన్నాయని చెప్పారు. ఆన్ లైన్ విధానం ఎలా ఉండబోతోందో స్పష్టతను ఇవ్వాలని పేర్ని నానిని కోరామని తెలిపారు. దీనిపై రానున్న సమావేశాల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు.

More Telugu News