ఘనతంతా షమీదే.. ఆ బౌన్సరే నాలోని ఆటగాడిని లేపింది!: హార్దిక్ పాండ్యా

29-09-2021 Wed 13:40
  • హార్దిక్ తలకు తగిలిన షమీ విసిరిన బౌన్సర్
  • అంతకుముందు వరకు ఇబ్బంది పడ్డానన్న ఆల్ రౌండర్
  • 40 పరుగులతో విజయంలో కీలక పాత్ర
Hardik Gives Credit To Shami For His Clinical Innings Against Punjab
ఎట్టకేలకు ముంబై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫాంను అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. అయితే, తాను అంత మంచి ఇన్నింగ్స్ ఆడడానికి కారణం ప్రత్యర్థి జట్టు బౌలర్ మహ్మద్ షమీనే అంటున్నాడు హార్దిక్. ఓ బౌన్సర్ విసిరి తనలోని ఆటను షమీ మేల్కొలిపాడని హార్దిక్ అన్నాడు.

నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ 30 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  

దీని గురించి హార్దిక్ చెబుతూ, ‘‘నా ఇన్నింగ్స్ ఘనత అంతా షమీదే. మహ్మద్ షమీ వేసిన బౌన్సర్ నా తలకు తగిలింది. వెంటనే పొలార్డ్ దగ్గరకు వెళ్లి.. ఈ బౌన్సర్ నన్ను మేల్కొలిపింది అని చెప్పా. అంతకుముందు వరకూ నేను చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ప్రతి అవకాశం కొత్తదే అనుకుంటూ మ్యాచ్ ఆడాను’’ అని తెలిపాడు. టీమ్ ను గెలిపించే ప్రతి ఒక్కరూ హీరోనేనని హార్దిక్ పాండ్యా చెప్పాడు. గతంలో ఏం జరిగిందన్నది తనకు అనవసరమని, వంద శాతం ప్రతిభ చూపేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.