Warangal: కాజీపేటలో దోపిడీ దొంగల బీభత్సం.. 2 కిలోల బంగారం, రూ. 3 లక్షల నగదు దోపిడీ

Robbery in Kazipet 2 kg gold and Rs 3 lakh cash extortion
  • వడ్డేపల్లి రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్‌లో చోరీ
  • నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంటిని ఊడ్చేసిన దొంగలు
  • ఇద్దరు కాపలాదారులు, 32 సీసీ కెమెరాలున్నా కళ్లుగప్పి అపార్ట్‌మెంట్‌లోకి
హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి 2 కిలోల బంగారం, రూ. 3 లక్షల నగదు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డేపల్లి రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న పీజీఆర్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లలో నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటాచలం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానస్ కుమార్, వ్యాపారవేత్త సౌజన్యకుమార్ నివసిస్తున్నారు. వీరంతా వివిధ కార్యక్రమాలు, పనుల నిమిత్తం ఆదివారం ఊర్లకు వెళ్లారు.

సోమవారం వీరి ఫ్లాట్ల తాళాలు పగలగొట్టి ఉన్నట్టు ఇరుగుపొరుగు ఫ్లాట్లలోని వారు గుర్తించారు. వెంటనే బాధితులకు సమాచారం అందించారు. వారొచ్చి చూసి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు దొంగలు అపార్ట్‌మెంట్ వెనకభాగంలో ప్రహరీపై ఉన్న ఫెన్సింగ్‌ కట్‌చేసి లోపలికి చొరబడ్డారు. వాచ్‌మన్ ఉంటున్న షెడ్‌ డోరుకు గడియపెట్టారు. అనంతరం మొదటి అంతస్తులోకి వెళ్లి 102 ఫ్లాట్ తాళం పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరాణాలు, రూ. 10 వేల నగదు తీసుకున్నారు.

అనంతరం రెండో అంతస్తులోని నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లోకి (202) చొరబడ్డారు. బీరువాలోని సుమారు  రెండు కిలోల బంగారు ఆభరణాలు అపహరించారు. ఆ తర్వాత సౌజన్యకుమార్ ఫ్లాట్ అయిన 203లోకి వెళ్లారు.  ఆ ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు.

 దొంగలు 2 గంటలకు చొరబడి 2.45 గంటలకు తిరిగి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల లోపువారని, తొలుత రెక్కీ చేసి ఆపై చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు సేకరించి గాలిస్తున్నారు.
Warangal
Hanamakonda
Theft
Crime News

More Telugu News