రెండేళ్ల పాపకు దగ్గు.. ఆసుపత్రిలో ఎక్స్‌రే తీస్తే ఏముందో తెలుసా?

28-09-2021 Tue 22:12
  • నెలరోజులుగా దగ్గుతో బాధపడుతున్న పాప
  • ఎక్స్‌రే తీస్తే ఊపిరితిత్తుల్లో కనిపించిన మెటల్ స్ప్రింగ్
  • శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు
doctors find metal spring in 2yr old girl lungs
నెలరోజులుగా రెండేళ్ల ఆ పాప దగ్గుతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీస్తే పాప ఊపిరితిత్తుల్లో చిన్న మెటల్ స్ప్రింగ్ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది.

బాధిత పాపను మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎంజీఎమ్ఎమ్‌సీ)కి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీసి పాప ఊపిరితిత్తుల్లోని స్ప్రింగ్‌ను గుర్తించారు. ఆడుకుంటూ పొరపాటున పాప దాన్ని మింగేసినట్లు భావిస్తున్నారు. అయితే ఆ స్పింగు కడుపులోకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లో చేరింది. పాపకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు స్ప్రింగును తొలగించినట్లు వెల్లడించారు. ఇలాంటి చిన్నపిల్లలు చిన్న చిన్న వస్తువులను మింగేసే ఘటనలు తరచూ జరుగుతుండటం సహజమే. కానీ ఇలా మింగిన వస్తువు ఊపిరితిత్తుల్లో చేరడం అరుదని వైద్యులు తెలిపారు.