అతను ధోనీలా కనిపిస్తున్నాడు.. యువప్లేయర్‌పై ఊతప్ప కామెంట్

28-09-2021 Tue 21:22
  • మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్
  • ధోనీలానే ప్రశాంతంగా ఉంటాడన్న వెటరన్ ఊతప్ప
  • 10 మ్యాచుల్లో 362 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్
His demeanor looks much like Dhoni
ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. కొన్ని మ్యాచుల్లో అతని ఇన్నింగ్సే జట్టును నిలబెట్టిందనడం అతిశయోక్తేమీ కాదు. చెన్నై జట్టులో సౌతాఫ్రికా వెటరన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న ఈ యువప్లేయర్‌పై భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు.

రుతురాజ్‌ను చూస్తే ధోనీని చూసినట్లే ఉందని ఊతప్ప కితాబునిచ్చాడు. ‘అతను చాలా ప్రశాంతంగా, హుందాగా, సరదాగా.. అచ్చం ధోనీలా కనిపిస్తున్నాడు. మంచి వ్యక్తి కూడా. నాకు రుతురాజ్ అంటే చాలా ఇష్టం. అతనో మంచి కుర్రాడు’ అని ఊతప్ప ప్రశంసించాడు. ఈ 24 ఏళ్ల ప్లేయర్ దొరకడం చెన్నై జట్టు అదృష్టమని వ్యాఖ్యానించాడు.

చెన్నై అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఊతప్ప ఈ వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా తరఫున అద్భుత ఇన్నింగ్సులు ఆడిన ఊతప్ప ప్రస్తుతం చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 మ్యాచులు ఆడిన రుతురాజ్ 362 పరుగులు చేసి సత్తా చాటుతున్నాడు.