కేటీఆర్... మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే బ్రాండ్ అంబాసిడర్ ను నేనే!: బండి సంజయ్

28-09-2021 Tue 20:19
  • కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
  • నేటికి 32వ రోజు
  • సిద్ధిపేట జిల్లాలో నేడు పాదయాత్ర
  • ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
Bandi Sanjay slams KTR
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటికి 32వ రోజుకి చేరింది. సిద్ధిపేట జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ అంటున్నాడని, కానీ కేటీఆర్... మీ సర్కారును గద్దె దించే బ్రాండ్ అంబాసిడర్ ను నేనే అని స్పష్టం చేశారు. రైతులను, దళితులను మోసం చేశారని, రైతు, దళిత సమాజం తరఫున నిలబడి కొట్లాడే బ్రాండ్ అంబాసిడర్ తానేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు.

మరో ట్వీట్ లో స్పందిస్తూ... రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లు కడితే మరో 10 లక్షల ఇళ్లయినా మంజూరు చేయించే బాధ్యత తనదని ప్రకటించారు. అవసరమైతే ఇద్దరం కలిసి ఢిల్లీ పోయి మోదీని అడుగుదామని కూడా చెప్పానని, కానీ కేసీఆర్ దాటవేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసేలేదని, వర్షాలతో పేదల ఇళ్లు కూలిపోతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు.