ఆనాడు మీ అన్నయ్యను వాళ్లు అన్నేసి మాటలు అంటుంటే నువ్వెక్కడ ఉన్నావ్ పవన్?: పోసాని ఫైర్

28-09-2021 Tue 19:55
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని ప్రెస్ మీట్
  • పవన్ పై విమర్శనాస్త్రాలు
  • పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహావేశాలు
  • సైకోలంటూ వ్యాఖ్యలు
Posani questions Pawan Kalyan
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ వాడీవేడిగా సాగింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై నిప్పుల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గతంలో చిరంజీవికి ఎదురైన ఓ బాధాకరమైన అనుభవాన్ని వివరించారు.

"అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి సంగతి ఇది. అవినీతికి వ్యతిరేకంగా చిరంజీవి ఎలుగెత్తారు. దాంతో ఆయనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లైవ్ లో ఆయన కుమార్తె గురించి, ఆయన ఇంట్లోని ఇతర మహిళల గురించి దారుణంగా మాట్లాడారు. దాంతో చిరంజీవి ఎంతో మనోవేదనకు గురయ్యారు. కనీసం అన్నం కూడా తినకుండా, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని నాకు కురసాల కన్నబాబు చెప్పారు.

అప్పట్లో కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. కన్నబాబు నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే, అన్నయ్యకు ఓసారి ఫోన్ ఇవ్వండి అన్నాను. అప్పుడు చిరంజీవి మాటల్లో తీవ్రమైన బాధ కనిపించింది. నా కుటుంబంలోని ఆడవాళ్లకు, రాజకీయాలకు ఏమిటి సంబంధం పోసానీ! అంటూ ఆవేదన వెలిబుచ్చారు. దాంతో నేను ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి వెళ్లి కేశినేని నానీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాను. ఆ దెబ్బకు అట్నుంచి స్పందనే లేదు.

ఆ సమయంలో పవన్ ఏమయ్యాడు? తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని వాళ్లు అన్ని మాటలు అంటే పవన్ ఎక్కడున్నాడు? బయటికి వచ్చి ఎందుకు ప్రశ్నించలేదు?" అంటూ పోసాని నిలదీశారు.

నాటి సంఘటనతో చిరంజీవికి తనపై ప్రేమ పెరిగిందని పోసాని వెల్లడించారు. పోసాని నా హృదయంలో ఉన్నాడంటూ ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్టు తర్వాత తెలిసిందని వివరించారు. పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఉన్మాదులని పోసాని అభివర్ణించారు.