హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత... పోసాని వ్యాఖ్యలపై పవన్ అభిమానుల ఆగ్రహావేశాలు

28-09-2021 Tue 18:47
  • ప్రెస్ క్లబ్ లో పోసాని మీడియా సమావేశం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు
  • పోసానీ నిన్ను వదలం అంటూ హెచ్చరికలు
  • వారిని అక్కడ్నించి తరలించిన పోలీసులు
Janasena workers agitations at Hyderabad Press Club

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి పవన్ పై తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఖబడ్దార్ అంటూ పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి నినాదాల్లో సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.

ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, పోసానిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్ ను లక్ష్యంగా చేసుకుంటారా? అని మండిపడ్డారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అయితే, పోలీసులు వారిని బలవంతంగా బయటికి తరలించారు. ఈ క్రమంలో ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.