నాడు తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు వచ్చిన వారికే పెన్షన్లు ఇచ్చారు: మంత్రి బాలినేని

28-09-2021 Tue 18:02
  • పెన్షన్ల అంశంపై స్పందించిన మంత్రి బాలినేని
  • గతంలో 50 లక్షల మంది అర్హులు ఉన్నారని వెల్లడి
  • చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికే ఇచ్చారని వ్యాఖ్యలు
  • జగన్ వచ్చాక 60 లక్షల మందికి ఇస్తున్నారని వివరణ
Balineni comments on pensions issue

ఏపీలో పింఛన్ల అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు వచ్చిన వారికే నాడు పింఛన్లు మంజూరు చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2018 అక్టోబరు నాటికి పింఛన్లకు అర్హులు 50 లక్షల మంది ఉంటే, అప్పటి ప్రభుత్వం 39 లక్షల మందికే పింఛన్లు ఇచ్చిందని తెలిపారు. అయితే ఎన్నికలు సమీపించే సరికి ఆ లెక్కను అమాంతం పెంచేశారని బాలినేని వెల్లడించారు.

ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే, లక్షన్నర మందికి పెన్షన్లు తొలగించారని చంద్రబాబు తోక మీడియా నానా యాగీ చేస్తోందని మండిపడ్డారు. తమది బీసీల పార్టీ అని బాలినేని పేర్కొన్నారు. వైసీపీ పరంగానూ, అటు సీఎం జగన్ కానీ బీసీలకు కనీవినీ ఎరుగని రీతిలో ఇస్తున్న గుర్తింపే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.