ప్రతి కార్యకర్త గర్వించాల్సిన క్షణం.. పుదుచ్చేరి నుంచి బీజేపీ ఎంపీ ఎన్నికపై మోదీ

28-09-2021 Tue 14:50
  • పుదుచ్చేరి నుంచి ఎంపీగా ఎన్నికైన సెల్వ గణబతి
  • మధ్యప్రదేశ్, అస్సాం నుంచి కూడా రాజ్యసభకు ఎంపీలు
  • అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేసిన మోదీ
Modi reacts As BJP Gets 1st Rajya Sabha MP From Puducherry
మొట్టమొదటిసారిగా పుదుచ్చేరి నుంచి బీజేపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ఇది పార్టీలోని ప్రతి కార్యకర్త గర్వించాల్సిన క్షణం అంటూ ట్వీట్ చేశారు. పుదుచ్చేరి నుంచి రాజస్యసభ ఎంపీగా బీజేపీ నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇలా పుదుచ్చేరి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నాయకుడు ఈయనే.

ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ట్విట్టర్ వేదికగా బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘రాజ్యసభ ఎంపీగా మన పార్టీ నేత ఎస్. సెల్వగణబతి ఎన్నిక పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణం. పుదుచ్చేరి ప్రజల నమ్మకం మనలో నమ్రతను పెంచాలి. పుదుచ్చేరి అభివృద్ధి కోసం నిరంతర కృషి కొనసాగుతుంది’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

అదే సమయంలో మధ్యప్రదేశ్, అస్సాం నుంచి ఎంపీలుగా ఎన్నికైన బీజేపీ నేతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి మురుగన్, అస్సాం నుంచి శర్బానంద సోనోవాల్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరంతా ప్రజాశ్రేయస్సు కోసం పార్లమెంటులో కృషి చేస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు.