రాజకీయ పార్టీ పెట్టనున్న 'ఎర్రకోట హింస' కేసు నిందితుడు, సింగర్ దీప్ సిద్ధూ.. రైతు సంఘాల నేతలతో చర్చలు!

28-09-2021 Tue 12:46
  • వెల్లడించిన సిద్ధూ సన్నిహితుడు
  • పంజాబ్ లో పలు చోట్ల పోస్టర్లు
  • రేపు పార్టీని ప్రకటించే అవకాశం
  • పంజాబ్ ఎన్నికల్లో పోటీకి కసరత్తులు
Red Fort Violence Accused Deep Sidhu To Form A Political Party

గణతంత్ర దినోత్సవం రోజున రైతులను రెచ్చగొట్టి ఎర్రకోట వద్ద హింసకు కారణమైన ఘటనలో నిందితుడిగా ఉన్న పంజాబ్ గాయకుడు దీప్ సిద్ధూ.. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బుధవారం చండీగఢ్ లో సిద్ధూ పార్టీ పేరును ప్రకటిస్తారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు.

ఇప్పటికే పంజాబ్ లోని చాలా ప్రాంతాల్లో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్లూ హల్ చల్ చేస్తున్నాయి. పార్టీ పేరును ‘వారిస్ పంజాబ్ దే’ అని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో పోటీకి కసరత్తులను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొందరు రైతు నేతలతోనూ సిద్ధూ చర్చలు జరుపుతున్నారని సమాచారం.


జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసకు సంబంధించి దీప్ సిద్ధూను ఫిబ్రవరి 9న పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పురాతన కట్టడాలకు నష్టం చేకూర్చారన్న ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఫిర్యాదు మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.