చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొంటూ.. సౌరవ్​ గంగూలీకి ఫైన్ వేసిన కలకత్తా హైకోర్టు

28-09-2021 Tue 11:36
  • అక్రమ భూ కేటాయింపుల కేసులో ఆదేశం
  • రూ.10 వేల జరిమానా విధింపు
  • రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలకూ రూ.50 వేల చొప్పున ఫైన్
  • కారకులైన ఉద్యోగుల నుంచి వసూలు చేసుకోవాలని సూచన
Calcutta High Court Fines BCCI President Sourav Ganguly

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కలకత్తా హైకోర్టు జరిమానా విధించింది. భూమి అక్రమ కేటాయింపులకు సంబంధించి ఆయనకు రూ.10 వేల ఫైన్ ను వేసింది. భూమిని కేటాయించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, బెంగాల్ గృహ మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్ (డబ్ల్యూబీహెచ్ఐడీసీవో)కు రూ.50 వేల చొప్పన జరిమానా వేసింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.

గంగూలీ స్కూల్ కోసం 2013 సెప్టెంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం న్యూ టౌన్ ప్రాంతంలో 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ కేటాయింపు అక్రమమని పేర్కొంటూ 2016లో ఓ వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆగస్టులో గంగూలీ ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు. తాజాగా ఆ కేసును చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరిజిత్ బెనర్జీల ధర్మాసనం విచారించింది.

లబ్ధిదారులు భూమిని తిరిగిచ్చేసినా.. చట్ట ప్రకారం ఆ కేటాయింపు అక్రమమేనని, దానిని తీసుకోవడమూ అక్రమమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటాయింపునకు కారణమైన అధికారులు, ఉద్యోగుల నుంచి ఆ జరిమానా మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది. గంగూలీ చట్ట ప్రకారం భూమిని తిరిగిచ్చేసినా.. చట్టం ప్రకారం మొదట భూమిని తీసుకోవడం తప్పేనని వ్యాఖ్యానించింది. దేశం ఎప్పుడూ క్రీడాకారులవైపు నిలుస్తుందని, ప్రత్యేకించి అంతర్జాతీయ వేదికలపై ఘనత సాధించిన వారికి అండగా నిలుస్తుందని పేర్కొంది.

క్రికెట్ లో దేశం తరఫున గంగూలీ ఎంతో ఘనత సాధించారని, అయితే, చట్టం ముందు అవేవీ ఎక్కువ కాదని తెలిపింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. చట్టానికి విరుద్ధంగా ఎవరూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.