West Bengal: బీజేపీ నేత దిలీప్‌ఘోష్‌పై దాడి.. తుపాకులు ఎక్కుపెట్టిన భద్రతా సిబ్బంది.. వీడియో వైరల్

  • ఈ నెల 30న భవానీపూర్ ఉప ఎన్నిక
  • ప్రచారం సందర్భంగా దాడి జరిగిందన్న బీజేపీ
  • కొట్టిపడేసిన టీఎంసీ
  • నివేదిక ఇవ్వాలన్న ఎన్నికల సంఘం
Assaulted Dilip Ghosh cuts short Bhabanipur bypoll campaign

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో బీజేపీ నేత దిలీప్‌ఘోష్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగినట్టు బీజేపీ ఆరోపించింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దిలీప్ ఘోష్ నిన్న భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఎంసీ కార్యకర్తలు దూసుకొచ్చారు.

ఈ క్రమంలో వారు దిలీప్‌పై దాడిచేసినట్టు బీజేపీ ఆరోపించింది. టీఎంసీ కార్యకర్తలు దూసుకొస్తుండడంతో అప్రమత్తమైన ఘోష్ భద్రతా సిబ్బంది దాడి జరగకుండా అడ్డుకున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా గుంపును చెదరగొట్టేందుకు ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులు బయటకు తీసి గాల్లోకి ఎక్కుపెట్టినట్టు బయటకు వచ్చిన వీడియోలు, ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.  

మరోపక్క, తనపైనా దాడి జరిగినట్టు బీజేపీకి చెందిన మరో నేత అర్జున్ సింగ్ కూడా ఆరోపించారు. అయితే, అధికార టీఎంసీ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. తాజా ఘటన నేపథ్యంలో భవానీపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

ఈ నెల 30న ఇక్కడ ఎన్నికలు జరగనుండగా, మమతకు ప్రత్యర్థిగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. కాగా, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌పై దాడి ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News