టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్ అతనే.. తేల్చేసిన సునీల్ గవాస్కర్

27-09-2021 Mon 22:44
  • టీ20 వరల్డ్ కప్ తర్వాత వీడ్కోలు పలకనున్న విరాట్ కోహ్లీ
  • నెక్స్ట్ ఎవరంటూ ఇప్పటికే చర్చలు ప్రారంభం
  • హిట్‌మ్యాన్ పేరు చెబుతోన్న లిటిల్ మాస్టర్ గవాస్కర్
Sunil Gavaskar picks Rohit Sharma as next T20 cricket
టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను పొట్టి క్రికెట్‌లో టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో తదుపరి టీ20 కెప్టెన్ ఎవరంటూ ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. భారత జట్టు సారధ్యంలో భారీ మార్పులకు ఇది సమయం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

అందుకే రోహిత్ శర్మను తదుపరి టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సూచించాడు. ‘‘వరుసగా ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో కెప్టెన్సీలో భారీ మార్పులు మంచిది కాదు. అందుకే రోహిత్‌ను కెప్టెన్ చేయాలి’’ అని లిటిల్ మాస్టర్ చెప్పాడు.

అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడం మంచిదని అభిప్రాయపడ్డాడు. అయితే రోహిత్, విరాట్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని వదంతులు ఉన్న నేపథ్యంలో గవాస్కర్ అభిప్రాయం చర్చనీయాంశంగా మారింది.