పిల్లి గీరిందనుకున్న వ్యక్తి.. తీరా చూస్తే తుపాకీ తూటా దిగిందని వెల్లడి

27-09-2021 Mon 22:09
  • రాజస్థాన్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్న నేమి చంద్
  • ముగ్గురితో కలిసి ఒక రూమ్‌‌లో నిద్రపోతుండగా ఘటన
  • కడుపులో నొప్పి వస్తే పిల్లి గీరిందని భావించిన వ్యక్తి
  • ఎక్స్‌రేలో బయటపడిన తుపాకీ తూటా
Man thought a cat scratched him but in reality a bullet lodged in his ribs

గాఢ నిద్రలో ఉన్న నేమి చంద్ అనే వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి తన కడుపులో కొంచెం నొప్పి వచ్చిందతనికి. ఏదో పిల్లి వచ్చి గీరిందని అనుకున్న అతను అలాగే పడుకున్నాడు. కానీ ఉదయాన్నే రూమ్‌మేట్‌కి బుల్లెట్ షెల్ కనిపించింది. దీంతో భయపడిన స్నేహితులు వెంటనే ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ నేమి చంద్‌కు ఎక్స్‌రే తీస్తే అతని పక్కటెముకల కింద తుపాకీ తూటా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. 35 ఏళ్ల నేమి చంద్‌ తన స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో నివసిస్తున్నాడు. సెప్టెంబరు 16 రాత్రి అతను నిద్రపోతున్నాడు. ఆ సమయంలో కడుపులో కొంచెం నొప్పిగా అనిపించింది. తనను ఏదో పిల్లి గీరిందని చంద్ అనుకున్నాడు. ఆ తర్వాత కూడా 7 గంటలపాటు నిద్రపోతూనే ఉన్నాడు.

ఉదయాన్నే అతని పక్కన ఒక బుల్లెట్ షెల్ దొరికింది. ఇది చూసిన స్నేహితులు ఆందోళన చెందారు. స్థానిక ఆస్పత్రికి వెళ్తే చంద్ శరీరంలో తూటా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి తూటాను బయటకు తీశారు. అయితే, అతని కడుపులోకి ఆ తూటా ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది.