జగన్ తో పోల్చుకునేంత వ్యక్తిత్వం నీకుందా?: పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన పోసాని

27-09-2021 Mon 21:09
  • రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ తీవ్ర వ్యాఖ్యలు
  • అదేస్థాయిలో స్పందించిన పోసాని
  • ఓ పంజాబీ అమ్మాయికి మోసం జరిగిందని వెల్లడి
  • ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్
  • అలా చేస్తే పవన్ కు గుడికడతానని వెల్లడి
Posani fires on Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ సర్కారును, వైసీపీ నేతలను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించారు. జగన్ తో పోల్చుకునేంత వ్యక్తిత్వం నీకుందా పవన్? అంటూ ప్రశ్నించారు. జగన్ పనితీరు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది, నువ్వెలాంటివాడివో తెలుసుకున్నారు కాబట్టే రెండు చోట్లా నిన్ను ఓడించి పంపారు అంటూ విమర్శించారు.

సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగాలని ఎన్నో వందల కలలతో ఓ పంజాబీ అమ్మాయి వచ్చిందని, కానీ అవకాశాల పేరుతో ఓ సెలబ్రిటీ ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ మోసాన్ని బయటపెడితే చంపేస్తానని కూడా బెదిరించాడని వివరించారు. ఆ అభాగ్యురాలికి న్యాయం చేస్తే పవన్ కు గుడికడతానని, పూజలు చేస్తానని అన్నారు. ఆ బాధితురాలికి న్యాయం చేయలేకపోతే ఏపీ మంత్రులను ప్రశ్నించే హక్కు పవన్ కు లేనట్టేనని తన అభిప్రాయాలను వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. తాను ఇలా మాట్లాడుతున్నందుకు చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించినా భయపడబోనని పోసాని ఉద్ఘాటించారు. పవన్ కల్యాణ్ ఎలాంటివాడో పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని అన్నారు.

"చిరంజీవి గతంలో ఏనాడైనా, ఎవర్నైనా అనవసరంగా ఒక్క మాట మాట్లాడారా? కానీ సినిమా ఫంక్షన్ లో పవన్ వాడిన భాష బాగాలేదు. తప్పు చేస్తే ఎవర్నైనా ప్రశ్నించవచ్చు. కానీ ఆధారాల్లేకుండా సీఎంను, మంత్రులను తిట్టడం మంచిదికాదు. జగన్ కు కులపిచ్చి ఉందని పవన్ నిరూపించగలరా? చంద్రబాబు హయాంలో జరిగిన  తప్పులపై ఎందుకు పవన్ ప్రశ్నించడంలేదు? ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు ఇబ్బందిపెట్టడం పవన్ కు తెలియదా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందనుకుంటున్నావా పవన్ కల్యాణ్?" అంటూ పోసాని నిలదీశారు.