దేశాధ్యక్షుడికి చేదు అనుభవం.. మాక్రాన్‌పై గుడ్డు విసిరిన ఆకతాయి

27-09-2021 Mon 20:54
  • రెస్టారెంట్ ఫెయిర్‌కు అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • అభిమానులతో మాట్లాడుతుండగా భుజానికి తాకిన గుడ్డు
  • ఆకతాయిని కలిసి మాట్లాడతానన్న మాక్రాన్
Man throws Egg at France President Emmanuel Macron

బహిరంగ కార్యక్రమానికి హాజరైన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిపైకి ఒక ఆకతాయి గుడ్డు విసిరాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని లియాన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ స్థానికంగా జరిగిన రెస్టారెంట్ ఫెయిర్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సమయంలోనే ఒక వ్యక్తి దూరం నుంచి మాక్రాన్‌పైకి గుడ్డు విసిరాడు. ఆ గుడ్డు మాక్రాన్ భుజంపై తగిలి ఎగిరి కిందపడింది. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై గుడ్డు విసిరిన వ్యక్తిపై మాక్రాన్ ఎటువంటి కోపం ప్రదర్శించలేదు. అతను తనతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పనివ్వాలని, తానే ఆ వ్యక్తిని స్వయంగా కలుస్తానని అన్నాడు.

లియాన్ పట్టణంలో ఇంటర్నేషనల్ కేటరింగ్, హోటల్ అండ్ ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (ఎస్ఐఆర్‌హెచ్ఏ) జరిగింది. ఈ కార్యక్రమం సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే మాక్రాన్‌పై కొందరు ఇలా నిరసన వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు.

2017 అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ఒక బహిరంగ సభలో మాక్రాన్ పాల్గొన్నారు. అప్పుడు ఒక వ్యక్తి విసిరిన గుడ్డు మాక్రాన్ తలపై పగిలింది. ఇటీవల వాలెన్స్‌లో అభిమానులను కలిసిన మాక్రాన్ వారికి షేక్‌హాండ్స్ ఇస్తూ ముచ్చటించారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మాత్రం మాక్రాన్ చెంప ఛెళ్లుమనిపించాడు. అతనికి నాలుగు నెలల జైలు శిక్ష విధించారు.

వచ్చే ఏడాది ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాక్రాన్ తన షెడ్యూల్‌ను చాలా బిజీగా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రెసిడెంట్ సెక్యూరిటీ బృందానికి పెద్ద కష్టమే అని కొందరు అంటున్నారు.