థియేటర్లకే 'భీమ్లా నాయక్' .. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

27-09-2021 Mon 18:24
  • ముగింపు దశకి చేరుకున్న 'భీమ్లా నాయక్'
  • టీజర్లకు .. టైటిల్ సాంగుకు భారీ రెస్పాన్స్
  • ఓటీటీకి వెళుతుందనే ప్రచారం
  • ఆ వార్తలను ఖండించిన సూర్యదేవర నాగవంశీ
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. పవన్ సరసన నాయిక పాత్రలో నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను చాలావరకూ చిత్రీకరించారు. ఇక రానా .. ఆయన జోడీకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరించవలసి ఉంది.

ఈ సినిమా నుంచి వదిలిన పవన్ టీజర్ తో పాటు, రానా టీజర్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. రానా లుక్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా ఆకట్టుకున్నాయి. 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా నిర్మాతలు ఓటీటీవైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

'రిపబ్లిక్' ఫంక్షన్లో పవన్ చేసిన విమర్శల ప్రభావం తమ సినిమా విడుదలపై పడుతుందని భావించడం, ప్రభాస్ 'రాధే శ్యామ్' .. మహేశ్ 'సర్కారువారి పాట' గట్టి పోటీ ఇస్తుండటం వలన, నిర్మాతలు ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. దాంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ట్వీట్ చేశారు.