అధికార క్రీడలో డాక్టర్లు ఏమైనా పుట్ బాల్స్ అనుకుంటున్నారా?: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

27-09-2021 Mon 18:21
  • నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో చివరి నిమిషంలో మార్పులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన పీజీ డాక్టర్లు
  • నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్న కోర్టు
  • కాస్త సున్నితంగా వ్యవహరించాలని కేంద్రానికి హితవు
Supreme Court furious over central govt on NEET PG Super Specialty

నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష-2021కు సంబంధించి సుప్రీం కోర్టు కేంద్రం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి చివరి నిమిషంలో మార్పులు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అధికార క్రీడలో డాక్టర్లను ఫుట్ బాల్స్ గా భావించవద్దు అని హితవు పలికింది. సంబంధిత వర్గాలతో వెంటనే సమావేశాలు నిర్వహించి, నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమకు అక్టోబరు 4న సమర్పించాలని స్పష్టం చేసింది.

నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ టెస్టులో కేంద్రం చేసిన మార్పులు జనరల్ మెడిసిన్ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయంటూ 41 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షాపత్రంలో 40 శాతం జనరల్ మెడిసిన్ ప్రశ్నలు కాగా, 60 శాతం సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు.

కానీ ఈసారి ప్రశ్నాపత్రంలో అన్నీ జనరల్ మెడిసిన్ ప్రశ్నలే ఇచ్చారని వారు తమ పిటిషన్ లో ఆరోపించారు. నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్షకు రెండు నెలల ముందు ఈ మేరకు మార్పులు చేశారని, ఇది తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.... తమ క్లయింట్లు పాత పద్ధతిలోనే ప్రశ్నాపత్రం వస్తుందని భావించి గత మూడేళ్లుగా  సన్నద్ధమవుతున్నారని కోర్టుకు విన్నవించారు. కానీ ప్రభుత్వ నిర్ణయం వారిని నష్టపరిచిందని వివరించారు. వాదనలు విన్న పిమ్మట జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

"అధికార క్రీడలో ఈ యువ డాక్టర్లను ఫుట్ బాల్స్ లాగా భావించకండి. ఏమాత్రం సున్నితత్వంలేని రాజకీయనేతల దయాదాక్షిణ్యాలకు ఈ యువ డాక్టర్లను వదిలివేయలేం. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి" అంటూ వ్యాఖ్యానించింది.

జస్టిస్ బీవీ నాగరత్న ప్రత్యేకంగా స్పందిస్తూ, వైద్యుల కెరీర్ కు సంబంధించి ఇది ఎంతో ముఖ్యమైన ఘట్టం అని, చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ పరీక్షల కోసం నెలల తరబడి సన్నద్ధమవుతుంటారని, అలాంటప్పుడు నూతన విధానాలను ఇప్పుడు కాకుండా వచ్చే ఏడాది ఎందుకు ప్రవేశపెట్టకూడదు? అని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. దయచేసి ఈ యువ వైద్యులతో కాస్త సున్నితంగా వ్యవహరించండి అంటూ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.