అక్టోబరు 2న ఏపీలో రెండు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ శ్రమదానం

27-09-2021 Mon 17:57
  • ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం
  • స్వయంగా రంగంలోకి పవన్ కల్యాణ్
  • ధవళేశ్వరం, కొత్తచెరువు ప్రాంతాల్లో పర్యటన
  • రోడ్ల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొంటున్న పవన్
Pawan Kalyan will attend two road repair works on Gandhi Jayanti
అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. తన శ్రమదానంలో భాగంగా... దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు.

అక్టోబరు 2న తొలుత ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజిపై ఛిద్రమైన రోడ్డుకు మరమ్మతులు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డు మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొంటారు.

ఏపీలో రహదారుల దుస్థితిపై జనసేన కొన్నాళ్లుగా పోరాడుతోంది. ప్రభుత్వం తాము విధించిన గడువులోగా స్పందించకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పవన్ కల్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. గాంధీ జయంతి నాడు ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన శ్రేణులు రహదారుల మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొంటాయని తెలిపారు.