రోడ్డు పక్కన పెళ్లి... పిలవకుండానే వెళ్లిన పంజాబ్ సీఎం

27-09-2021 Mon 17:39
  • ఇటీవల సీఎంగా బాధ్యతలు అందుకున్న చన్నీ
  • సీఎం హోదాలో భటిండాలో పర్యటన
  • కొత్త జంటను ఆశ్చర్యానికి గురిచేసిన వైనం
  • వధూవరులకు ఆశీస్సులు
Punjab CM surprised new couple
ఇటీవల అనూహ్య పరిణామాల నేపథ్యంలో చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఇటీవల ఆయన భటిండా పర్యటనకు వెళ్లగా ఆసక్తికర సంఘటన జరిగింది. కలాన్ అనే గ్రామం నుంచి సీఎం కాన్వాయ్ వెళుతుండగా, అదే సమయంలో రోడ్డు పక్కగా ఓ వివాహ వేడుక జరుగుతోంది. ఇది గమనించిన సీఎం చరణ్ జిత్ చన్నీ వెంటనే తన కాన్వాయ్ ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కారు దిగిన ఆయన నేరుగా పెళ్లిమంటపం వద్దకు వెళ్లి వధూవరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

తాము పిలవకపోయినా, సీఎం అంతటివాడు తమ పెళ్లికి రావడంతో ఆ కొత్తజంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. కాగా, సీఎం చరణ్ జిత్ చన్నీ ఆ వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. పెళ్లిమంటపం వద్ద అందించిన మిఠాయి కూడా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.