కూతురు సారా గురించి భావోద్వేగమైన పోస్ట్ చేసిన సచిన్

27-09-2021 Mon 15:52
  • డాటర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన పోస్ట్
  • సారాతో కలిసున్న ఫొటోను పోస్ట్ చేసిన సచిన్
  • నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటానన్న టెండూల్కర్
Sachin posts about his daughter on daughters day

తన కూతురు సారా గురించి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో వచ్చే చివరి ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా 'కూతుళ్ల దినోత్సవం'గా జరుపుకుంటారనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిన్న డాటర్స్ డేను అందరూ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురు సారా చిన్నప్పటి ఒక ఫొటోను సచిన్ షేర్ చేశాడు. తన ముద్దుల తనయను ఒడిలో కూర్చోబెట్టుకుని సచిన్ ఆడిస్తున్నట్టుగా ఫొటోలో ఉంది. అంతేకాదు తన కూతురిపై తనకున్న అమితమైన ప్రేమను ఆయన చాటుకున్నారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.

'నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఎంత సమయమైనా వెంటనే గడిచిపోతుంది. నా ఒడిలో ఆడుకున్న చిన్నారి ఇప్పుడు అందమైన యువతిగా మారింది. నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. హ్యాపీ డాటర్స్ డే' అని సచిన్ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి చేసిన పోస్టుకి సారా రిప్లై ఇచ్చింది. లవ్ యూ డాడ్ అంటూ నాన్నపై ప్రేమను కురిపించింది. తండ్రి, కూతురు మధ్య జరిగిన ఈ పోస్టులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.