Moeen Ali: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్

  • రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్ అలీ
  • ఇకపై వన్డేలు, టీ20లకు ప్రాధాన్యత
  • కెరీర్ లో 64 టెస్టులాడిన మొయిన్ 
  • బ్యాటింగ్ లోనూ, స్పిన్నర్ గానూ విశిష్ట సేవలు
Moeen Ali says good bye to test cricket

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐదు రోజుల ఫార్మాట్ కు నేడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల మొయిన్ అలీ తన కెరీర్ లో 64 టెస్టులు ఆడాడు. 28.29 సగటుతో 2,914 పరుగులు సాధించాడు. వాటిలో 5 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 36.66 యావరేజితో 195 వికెట్లు తీశాడు.

మొయిన్ అలీ పాకిస్థాన్ సంతతి ఆటగాడు. 2014 జూన్ లో శ్రీలంకపై తన తొలి టెస్టు ఆడాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు స్పిన్ బౌలింగ్ తోనూ ఇంగ్లండ్ జట్టుకు ఎంతో ఉపయుక్తమైన ఆల్ రౌండర్ గా సేవలు అందించాడు. ఇకపై వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండనున్నాడు.

రిటైర్మెంట్ సందర్భంగా మొయిన్ అలీ... తన తల్లిదండ్రులకు, టెస్టు క్రికెట్లో తన అరంగేట్ర కోచ్ పీటర్ మూర్స్, ప్రస్తుత కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్, తన మొదటి కెప్టెన్ అలిస్టర్ కుక్, ప్రస్తుత కెప్టెన్ జో రూట్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. టెస్టు క్రికెట్లో తనకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఉత్కంఠభరిత పోరాటాలు సాగించానని, తనదైన రోజున ఎంతటి బ్యాట్స్ మన్ ను అయినా అవుట్ చేయగలిగానని పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్ జట్టుతో కలిసి ఇకపై టెస్టు బరిలో దిగలేకపోవడం కొంచెం బాధగా ఉందని తెలిపాడు.

More Telugu News