Prime Minister: ఇక అందరికీ హెల్త్ ఐడీ.. ప్రధాని నరేంద్ర మోదీ

  • ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం
  • ప్రతి ఒక్కరి పేరిట హెల్త్ అకౌంట్
  • టెస్టులు, చికిత్స, జబ్బులకు సంబంధించిన వివరాల నమోదు
PM Modi Launches Ayushman Bharat Digital Mission

ఆరోగ్య రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ లో భాగంగా ప్రతి ఒక్కరికీ హెల్త్ ఐడీ ఇస్తారని చెప్పారు. ఆ ఐడీనే హెల్త్ అకౌంట్ కు వినియోగించనున్నారు. పేద, మధ్యతరగతి వారికి చికిత్సనందించడంలోని సమస్యలను హెల్త్ ఐడీ పరిష్కరిస్తుందని మోదీ చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి ఆసుపత్రితో పేషెంట్లను అనుసంధానించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రోగికి సంబంధించిన పక్కా సమాచారంతో మంచి చికిత్సను అందించేందుకు వీలవుతుందని ప్రధాని చెప్పారు.

రషన్ నుంచి ప్రశాసన్ వరకు సామాన్యులందరికీ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా) చేరువ అయిందని పేర్కొన్నారు. 118 కోట్ల మంది ఫోన్లు వాడుతున్నవారిలో 80 కోట్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని, వారంతా యూపీఐని వాడుతున్నారని, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత మంది ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను వాడడం లేదని చెప్పారు.

దేశంలో ఇప్పటిదాకా 90 కోట్ల కరోనా టీకా డోసులను జనానికి వేశారని ఆయన వివరించారు. కొవిన్ ప్లాట్ ఫాం ద్వారా సర్టిఫికెట్లను కూడా ఇస్తున్నామన్నారు. కాగా, ఇప్పటికే ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

 ఇందులో భాగంగా ప్రతిఒక్కరికీ హెల్త్ ఐడీలను ఇచ్చి వారిపేరిట ఓ హెల్త్ అకౌంట్ ను తెరుస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నింటినీ అందులో నమోదు చేస్తారు. టెస్టులు, జబ్బులు, డాక్టర్ చెకప్ ల వంటి వివరాలన్నీ పొందుపరుస్తారు. పేషెంట్లు, ఆసుపత్రులకు అనుసంధానకర్తగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్ లు ఉంటాయి.

More Telugu News