గుర్రపు బగ్గీలపై అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు

27-09-2021 Mon 12:51
  • రోడ్డు మీదే ఆపేసిన పోలీసులు
  • గేటు ముందు నేతల బైఠాయింపు
  • అరెస్ట్ చేసిన స్టేషన్ కు తరలింపు
Congress Leaders Protest By Arriving On Horse Buggy
ఇంధన ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ నేతలు వినూత్న శైలిలో నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెను భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబులు గుర్రపు బగ్గీలపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, వారిని పోలీసులు రోడ్డు మీదే ఆపేశారు.

దీనిపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేశారు. అసెంబ్లీ గేటు ముందు ఆందోళనకు దిగారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని భట్టి అన్నారు.