‘ఆంధ్రావాలా’ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

27-09-2021 Mon 09:37
  • ఆర్ఆర్ మూవీ మేకర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ
  • తెలుగులో అగ్రహీరోలతో పలు సినిమాలు
  • హిందీలో అవార్డు విన్నింగ్ సినిమా ‘ఏక్ హసీనా థీ’
  • ‘డివోర్స్ ఇన్విటేషన్’ సినిమాతో 2012లో హాలీవుడ్‌కి
Tollywood producer RR Venkat passes away
తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆర్ఆర్ మూవీ మేకర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన వెంకట్ 2012లో హాలీవుడ్‌లోకీ ప్రవేశించారు. జొనాథన్ బెన్నెట్ కథానాయకుడిగా ‘డివోర్స్ ఇన్విటేషన్’ అనే సినిమాను నిర్మించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు.

అలాగే, హిందీలో రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఏక్ హసీనా థీ’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అవార్డు కూడా అందుకున్నారు.  తెలుగులో సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్‌మేన్, పైసా, పూలరంగడు వంటి చిత్రాలను నిర్మించారు. వెంకట్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.