జగన్ కోసం శక్తికి మించి చేశాను... కానీ సంబంధం లేదన్నారు: షర్మిల

26-09-2021 Sun 21:52
  • రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల
  • తెలంగాణలో పార్టీ ఏర్పాటు
  • కుటుంబంలో చర్చ జరిగిందన్న షర్మిల
  • పార్టీ వద్దన్నారని వెల్లడి
  • సజ్జల వ్యాఖ్యలు బాధించాయన్న షర్మిల 
Sharmila explains how she started a political party

రాజకీయాల్లోకి రావడం అనేది తన సొంత నిర్ణయం అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తాను తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తాను అనగానే, సీఎం జగన్, ఇతర కుటుంబ సభ్యులు వద్దన్నారని వెల్లడించారు. పార్టీ ఏర్పాటుపై కుటుంబంలో ఎంతో చర్చ జరిగిందని అన్నారు. ఒకరు చెబితే తాను పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, వాళ్లు వద్దన్నారని తాను నిర్ణయం మార్చుకోలేదని వివరించారు. అయితే, ఆమెతో మాకు ఇక సంబంధంలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని, ఆ వ్యాఖ్యలతో తాను చాలా బాధపడ్డానని షర్మిల వెల్లడించారు.

"నేను రాజకీయాల్లో మొట్టమొదటి అడుగువేసిన రోజున రామకృష్ణారెడ్డి ఇక సంబంధం లేదు అనే పదం వాడాడు. అదే జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం నేను శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా వాళ్లు ఏం అడిగితే అది చేశాను. ఎందుకు చేశానంటే బాధ్యత ఉంది కాబట్టి చేశాను... రక్తసంబంధం ఉంది కాబట్టి చేశాను. అలాంటిది సంబంధం లేదు అనే ఒక్కమాటతో తేల్చేశారు. విభేదాలు లేనిది ఎక్కడ? అందరి ఇళ్లలో ఉంటాయి. విభేదాలు ఉన్నంత మాత్రాన సంబంధం లేదు అనడం సరికాదు" అని హితవు పలికారు.

తన రాజకీయ పార్టీపై వచ్చిన ఊహాగానాలకు కూడా షర్మిల వివరణ ఇచ్చారు. జగన్ వదిలిన బాణం అని, కేసీఆర్ వదిలిన బాణం అని రకరకాల కథనాలు గందరగోళం కలిగిస్తున్నాయని ఆర్కే పేర్కొనగా, తాను ప్రజలు వదిలిన బాణాన్ని అని షర్మిల ఉద్ఘాటించారు. తన తల్లి విజయమ్మ గురించి చెబుతూ, పార్టీ ఏర్పాటు సమయంలో తనను ప్రోత్సహించారని, అడ్డుచెప్పలేదని వెల్లడించారు. ప్రతి ఘట్టంలో తన వెన్నంటే ఉన్నారని తెలిపారు.