వైఎస్సార్ తనను ఏమని పిలుస్తారో వెల్లడించిన షర్మిల

26-09-2021 Sun 20:54
  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
  • కార్యక్రమానికి విచ్చేసిన షర్మిల
  • తన ముద్దుపేరు వెల్లడించిన వైఎస్ తనయ
  • తండ్రి మరణంతో షాక్ తిన్నామని వెల్లడి
YS Sharmila at Open Heart With RK
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలను షర్మిల పంచుకున్నారు. ఇంట్లో అందరూ తనను 'షమ్మీ' అంటారని, తండ్రి వైఎస్సార్ మాత్రం ముద్దుగా 'పాప్స్' అంటారని తెలిపారు. తండ్రి వద్ద జగన్ కంటే తనకే చనువు ఎక్కువని వివరించారు. వైఎస్సార్ తనకోసం ఏమైనా చేస్తారని, ఓసారి తన భర్త అనిల్ కుమార్ కు వ్యాపారంలో ఇబ్బంది వచ్చిందని, అప్పుడు తాను చెప్పకముందే తన తండ్రి కళ్లలో నీళ్లు తిరిగాయని షర్మిల గుర్తుచేసుకున్నారు.

నాడు వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడైనా విస్ఫోటనం జరిగిందా అని ఎంక్వైరీ చేశానని, ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయివుంటారని పెద్దగా భయపడలేదని వివరించారు. కానీ, ప్రమాదం జరిగిందని తెలిసి షాక్ తిన్నామని, ఓ సంవత్సరం పాటు కోలుకోలేకపోయానని చెప్పారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని షర్మిల మీడియా ముఖంగా వెల్లడించారు. అప్పట్లో తండ్రి మరణం సందర్భంగా తన సోదరుడు జగన్ సంతకాల సేకరణ చేపట్టలేదని, సంతకాల సేకరణ చేపట్టింది వేరొకరని స్పష్టం చేశారు.

మీరు దేవుడ్ని నమ్ముతారు కదా, మరి మీ నాన్న ప్రమాదంలో చనిపోవడాన్ని ఎలా తీసుకుంటారని ఆర్కే ప్రశ్నించారు. అందుకు షర్మిల స్పందిస్తూ, మనకు అన్ని విషయాలు తెలియదు కాబట్టే మనుషులం అయ్యామని, లేకపోతే దేవుళ్లం అయిపోతాం కదా అని వ్యాఖ్యానించారు. ఏదో ఒకనాడు దేవుడి వద్దకు వెళితే ఇలా ఎందుకు చేశావని అడుగుతానని తెలిపారు. తన తండ్రి చాలా చాలా మంచి వ్యక్తి అని షర్మిల పేర్కొనగా, ఆ విషయం తాను అంగీకరిస్తానని ఆర్కే పేర్కొన్నారు.