పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై దుమారం... ప్రకటన విడుదల చేసిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్

26-09-2021 Sun 20:33
  • ఏపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్
  • అవి పవన్ వ్యక్తిగత వ్యాఖ్యలన్న ఫిలిం చాంబర్
  • పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని వెల్లడి
  • తమకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ముఖ్యమని వివరణ
Telugu Film Chamber Of Commerce issues statement on Pawan Kalyan remarks
ఏపీ రాజకీయాల్లో సినిమా అంశం ప్రవేశించింది. సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్... నిన్న రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. దాంతో మంత్రులు తోకతొక్కిన తాచుల్లా పవన్ పై బుసలు కొడుతున్నారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

ఆ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ వ్యక్తిగతం అని స్పష్టం చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలతో ఫిలిం చాంబర్ కు సంబంధం లేదని వెల్లడించింది. చిత్ర పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు ఉన్నాయని, కొందరు వ్యక్తిగత అభిప్రాయాలను పలు వేదికలపై వెల్లడిస్తున్నారని తెలిపింది. టాలీవుడ్ పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని, అలాంటి అభిప్రాయాలతో తమకు సంబంధంలేదని ఫిలిం చాంబర్ వివరణ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ముఖ్యమని ఉద్ఘాటించింది.

పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేగుతున్న సందర్భంలో ఫిలిం చాంబర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సినీ రంగ ఇబ్బందులపై ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించామని, సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తన ప్రకటనలో వెల్లడించింది. ఇటు తెలంగాణ సీఎం, అటు ఏపీ సీఎం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారని వివరించింది.