మాకు బెదిరింపులు వచ్చినా భారత్‌లో పర్యటించాం: అఫ్రిదీ

26-09-2021 Sun 18:28
  • పాకిస్థాన్‌లో భద్రతపై పలు దేశాల అనుమానాలు
  • ఇప్పటికే సిరీస్‌లు రద్దు చేసుకున్న న్యూజిల్యాండ్, ఇంగ్లండ్
  • అసంతృప్తి వ్యక్తం చేసిన బూమ్ బూమ్

We were getting threats from India but still we went there says Shahid Afridi
పాకిస్థాన్‌లో భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ జట్లు తమ పర్యటనలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలువురు వెటరన్ పాకిస్థాన్ క్రికెటర్లు ఆయాదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా షాహిద్ అఫ్రిదీ కూడా చేరాడు.

అభిమానులు ‘బూమ్ బూమ్ అఫ్రిదీ’గా పిలుచుకునే ఈ మాజీ కెప్టెన్.. కివీస్, బ్రిటిష్ జట్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విద్యావంతమైన దేశాలు భారత్ బాటలో నడవకూడదని అఫ్రిదీ అన్నాడు. భారత్‌లో పరిస్థితులు బాగలేనప్పుడు, తమకు బెదిరింపులు కూడా వచ్చాయని అఫ్రిదీ చెప్పాడు.

కానీ ఆ సమయంలో కూడా తమ బోర్డు భారత్ వెళ్లి ఆడాలని చెబితే తమ జట్టు భారత పర్యటనకు వెళ్లిందని గుర్తుచేశాడు. అదే విధంగా కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇంగ్లండ్ వెళ్లాల్సి వస్తే తాము వెళ్లామని, ఆట సాగిందని అన్నాడు. తమ దేశం విషయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని అక్కసు వెళ్లగక్కాడు.